దీపావళి రోజున 4.5 లక్షల మందికి కొత్త పింఛన్లు ప్రారంభించిన రేవంత్

దీపావళి రోజున 4.5 లక్షల మందికి కొత్త చేయూత పింఛన్లు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. 2034 నాటికి కోటి మంది మహిళా కోటీశ్వరులు చేయడమే లక్ష్యమన్నారు.

దీపావళి పండుగ రోజున ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేట పారిశ్రామిక కేంద్రంలో మహిళలతో సమావేశమయ్యారు. తన పుట్టినరోజునే 4.5 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్ల పంపిణీని ప్రారంభించారు.

4.5 లక్షల మందికి కొత్త పింఛన్లు

వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, కల్లు తొలిచే కార్మికులతో సహా మరికొంత మందికి కొత్తగా పింఛన్లు మంజూరైనట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్త లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన సీఎం, తమ ప్రభుత్వం ప్రతి పథకాన్ని మహిళల పేరిట అమలు చేస్తోందని అన్నారు.

2034 నాటికి కోటి మంది మహిళా కోటీశ్వరులే లక్ష్యం

తన పుట్టినరోజును మహిళా శక్తికి అంకితం చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తన జీవిత లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం 70 లక్షల మంది మహిళలు స్వయం సహాయక బృథాల్లో ఉన్నారని, వారి సంఖ్యను 2034 నాటికి కోటికి పెంచుతామన్నారు. మహిళలు తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని కోరారు.

మహిళా బృథాలకు అడుగడుగునా మద్దతు

25.5 లక్షల మంది పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు (ఒక్కొకరికి రెండు జతలు) శిక్షణ పొందిన మహిళలే కుట్టారని సీఎం పేర్కొన్నారు. మహిళా బృథాలకు పెట్రోల్ బంక్లు, సోలార్ విద్యుత్ కేంద్రాలు కేటాయిస్తున్నామని, సచివాలయంతో సహా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లను మహిళలే నిర్వహిస్తున్నారన్నారు. 34 నెలల్లో రూ. 79 వేల కోట్ల బ్యాంకు లింకేజ్ రుణాలు అందించగా, రూ. 1,900 కోట్ల వడ్డీని ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. 8.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరిట మంజూరు చేసినట్లు చెప్పారు.

నవంబరు 19న కోటి మందికి ఇందిరమ్మ చీరలు

మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నెలకు రూ. 8-10 వేలు మిగులుతున్నాయని, ఇప్పటివరకు 37 లక్షల ఉచిత ప్రయాణాలు జరిగాయని, ఆర్టీసీకి ప్రభుత్వం రూ. 13 వేల కోట్లు చెల్లించిందని రేవంత్ వెల్లడించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబరు 19న కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. 2034 నాటికి లక్ష్యమైన ఒక ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ అభిప్రాయం?
ఇంకా ఓట్లు లేవు. మొదట ఓటు వేయండి!