బాసిల్ జోసెఫ్ నటనకు విరామం? అల్లు అర్జున్ సినిమా కోసం ప్రణాళిక అని ప్రచారం

అల్లు అర్జున్ చిత్రం కోసం బాసిల్ జోసెఫ్ నటనకు విరామం ఇచ్చి దర్శకత్వంపై దృష్టి పెట్టనున్నట్లు ప్రచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అల్లు అర్జున్ చిత్రం కోసం బాసిల్ జోసెఫ్ నటనకు విరామం అని ప్రచారం

మలయాళ స్టార్ నటుడు, ‘మిన్నల్ మురళి’ దర్శకుడు బాసిల్ జోసెఫ్ నటనకు కొంత విరామం ఇచ్చి దర్శకత్వంపై దృష్టి పెట్టనున్నట్లు మాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్‌తో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కించే పనిలో ఆయన బిజీగా ఉన్నారని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై బాసిల్ జోసెఫ్ లేదా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ఏడాదిన్నరగా సోలో హీరో సినిమా లేదు

సాధారణంగా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే బాసిల్ జోసెఫ్, 2026లో క్యామియో పాత్రలు, మల్టీస్టారర్ చిత్రాలకే పరిమితమయ్యారు. ‘పరాశక్తి’, ‘మాలీవుడ్ టైమ్స్’ చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తే, మల్టీస్టారర్ ‘అతిరధి’లో హీరోల్లో ఒకరిగా నటించారు. సోలో హీరోగా ఆయన నటించిన చివరి చిత్రం ‘మరణమాస్’. ప్రస్తుతం ఆయన చేతిలో తమిళ చిత్రం ‘రావడి’, ‘మంజేశ్వరం మాఫియా’ ఉన్నాయి.

అల్లు అర్జున్ ప్రాజెక్టే కారణమా?

అవకాశాలు లేకపోవడం కాదని, స్వయంగా నటనకు విరామం ప్రకటించి దర్శకత్వంపై ఫోకస్ పెట్టాలని బాసిల్ భావిస్తున్నారని, దానికి కారణం అల్లు అర్జున్‌తో తెరకెక్కించబోయే భారీ చిత్రమే అని ప్రచారం జరుగుతోంది. ‘మిన్నల్ మురళి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో బన్నీ నటించే చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ వార్తపై మీ అభిప్రాయం?
ఇంకా ఓట్లు లేవు. మొదట ఓటు వేయండి!